అలర్జీ – ఆస్తమా బాధితుల అంతరంగాలు

 

శరీరత్వం (ఎటోపి), వాతావరణం కాలుష్యం (ట్రిగ్గర్లు) ఈ రెండు కలిస్తే ఉబ్బసం. తరతరాలుగా జీన్స్ ద్వారా సంక్రమించే శరీర తత్వాలను మధ్యలో మారలేము. వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించనూ లేము. ఈ రెండూ కలవకుండా చూడాలి. నివారణ మార్గాలను పాటించాలి. అనాదిగా మనిషిని ఇన్ని విధాలుగా బాధించే వ్యాధి ఇంకొకటి లేదేమో. దీర్ఘకాలం బాధించే వ్యాధుల్లో ఇదే అతి చికాకైనది మరియు చికాకైనది.

మనిషి మనుగడకు ముఖ్యమైనవి గాలి – నీరు – ఆహారం. ఆహారం లేకుండా కొద్ది రోజులు బ్రతకొచ్చు. నీరు లేకుండా కొద్ది గంటలు బ్రతకొచ్చు. కానీ గాలి లేకుండా కొన్ని నిముషాలైనా బ్రతకగలమా ? కాబట్టి జీవించడానికి అతి ముఖ్యమైనది గాలి. గాలి పుష్కలంగా ఉన్న, పీల్చుకోలేని అభాగ్యులు – ఆస్తమా రోగులు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు – జీవితావసరాలైన ఆహారం కోసం మనిషి అనాదిగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రెండు దశాబ్దాల క్రితం నీరు ‘కొని’ త్రాగవలసిన వస్తుందని చాలామంది అనుకోలేదు. అలాగే ముందు ముందు మంచి గాలి ‘కొని’ పీల్చు కోవలసిన వస్తుందని అంటే కూడా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ పరిస్థులు గాలిని పీల్చు ‘కొనే’లా ఉన్నాయి. కాబట్టి గాలి కోసం పోరాటం చేసే రోజులు ముందు ముందు రనున్నాయి. అన్నిటికంటే విలువైనది, ప్రాణాధారమైనది, అసలు ఖర్చు లేనిది, అందరికి ఉచితంగా లభించేది, అంతటా లభించేది అయిన ఈ గాలి కోసం కొందరు అభాగ్యులు శతాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గాలి పీల్చలేక, పోరు సలపలేక, దిక్కుతోచక అలసి సొలసి, ఉక్కిరిబిక్కరై జీవచ్ఛవాలుగా బ్రతుకు వెల్లడిస్తున్నారు. కొందరు. అనుక్షణం గాలికోసం తపిస్తూ, జపిస్తూ ఆశతో ఆర్తిగా ఎదురుచూస్తున్నారు మరికొందరు. అజ్ఞానంతో, అమాయ కత్వంతో, నిరక్షరాస్యతవల్ల మూఢనమ్మకాలకు, తప్పుడు వైద్యులకు బలవుతున్నారు ఇంకొందరు. వీరే ఉబ్బసం రోగులు. ఈ వ్యాధి మొదలయ్యేది బాల్యదశలోనే, దీన్ని గుర్తించి అరికట్టాలి. లేదంటే వ్యాధి ముదిరి పూర్తిస్థాయి ఉబ్బసం రోగులుగా మారతారు.

ఆస్తమాతో తమ విలువైన జీవితాన్ని బాధలతో, కష్టాలతో గడుపుతుంటారు. ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోయేవారు కొందరైతే, ఎవరికి చెప్పుకున్న ఏ ఫలితం పొందని వారు ఇంకొందరు. ఈ వ్యాధి మనిషిని ఎంతగా బాధిస్తుందో, మనసుని అంతకంటే వేయిరెట్లు బాధిస్తుంది. ఈ బాధలు పడేకంటే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతే బావుండునని మనుసులో కొన్ని వందల సార్లు అనుకునే వారు కొన్ని వేళా మంది ఉంటారు. ఈ బాధలు పేదవాడికి కూడా రాయవద్దని పొగిలి పొగిలి ఏడుస్తారు. కుమిలి పోతుంటారు. ఉబ్బసం రోగులు జీవన గమనాన్ని క్రమబద్ధంగా, లోతుగా పరికిద్దాం. ఏ దశలో ఎలా బాధపడుతుంటారో, వారి జీవితాన్ని వారు ఎలా అసహ్యించుకుంటారో, పరిపరి విధాలుగా పరితపించే వారి మనసు, ఆలోచనలు, అంతరంగాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

కొత్త దంపతులు: కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తారు. ఎవరికి ఉబ్బసం ఉన్న మొదటి రాత్రే ఇబ్బందులకు గురి అవుతారు. కానీ ఎవరికి చెప్పుకోలేరు. దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడు ఉబ్బసం వ్యాధి దశను బట్టి కొందరికి అంతులేని ఆయాసం వస్తుంది. దగ్గు, పిల్లికూతలు వస్తాయి. విపరీతంగా చెమటలు పడతాయి. అది చూసి ఉబ్బసం లేని భార్యగాని, భర్తగాని ఆశ్చర్యపోతారు. ఇంత ఆయాసం దేనికో అర్థం కాదు. కొందరు అర్థం చేసుకోలేరు. అంతే అపార్థాలు మొదలవుతాయి. సరియైన శాస్త్రీయ వైద్యం పొందితే అందరిలా, ఆనందంగా గడపొచ్చు అనే విషయం తెలిసే సరికే సమస్య చాలా దూరం వెళ్ళిపోతుంది. కొందరు విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతారు. ఇంకొందరు మోసపోయామని, అసలు విషయం చెప్పకుండా అంటగట్టారని వాపోతారు.

ఆడపిల్లలకి ఆస్తమా ఉంటె అత్తవారింటిలో వారు పడే బాధలు చాలా దారుణంగా ఉంటాయి. ఏ పని చేయలేదని, చేతకాదని, చీటికి మాటికి జలుబు చేస్తుందని, జబ్బు మనిషి అని చీదరించుకుంటారు. ఛీకొడుతుంటారు. కొందరు మాత్రం అర్థం చేసుకొని వారిని ఆదుకుంటారు. ఆదరిస్తారు. సరియైన వైద్యాన్ని సకాలంలో అందిస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు. అర్థం చేసుకోకపోతే మిగిలిదే అపార్థం, జరిగేది అనర్థం, ఫలితం అనూహ్యం.

భార్యకు ఆస్తమా ఉంటె తన కారణంగా భర్త సుఖసంతోషాలు పొందలేక పోతున్నాడని కుమిలిపోతుంది. భర్త ఆస్తమాతో బాధపడుతుంటే భార్యను సుఖపెట్టలేక పోతున్నాని, అంతర్మథనం చెందుతూ, కుమిలిపోతూ, కుంగిపోతూ ఆత్మన్యూనతా భావానికి లోనవుతాడు. అర్థం చేసుకోగలిగితే, సరియైన వైద్యాన్ని సకాలంలో పొందితే అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఒకరి బాధలో ఇంకొకరు పాలుపంచుకుంటారు, పరిచర్యలు చేస్తారు.
కొత్త కాపురానికి ఆస్తమాతో అడుగుపెట్టిన ఆడపిల్ల తల్లిదండ్రులు అక్కడ తమ బిడ్డ ఎన్ని బాధలు పడుతుందోనని, అత్తమామలు, ఆడబిడ్డలు తమ కూతురుని రాచి రంపాన పెడుతున్నారేమో అని తీవ్ర ఆందోళన చెందుతుంటారు. మదనపడుతుంటారు. తమ బిడ్డ కాపురం ఏ క్షణాన ఏమవుతుందోనని తల్లడిల్లిపోతుంటారు.అలాగే మగ పిల్లవాడికి ఆస్తమా ఉంటె – భార్య తరపు వాళ్ళు తమ కొడుకుని చులకన చేస్తారని, చేతకాని వాడి క్రింద జమకడతారని జంకుతుంటారు, అశాంతికి గురవుతారు.
ఇదంతా ఒకెత్తయితే, దంపతులు తమకు పుట్టబోయే పిల్లలకు కూడా తమ పోలిక వస్తుందేమోనని వణికి పోతుంటారు. తీరా వచ్చిన తర్వాత వారి మానసిక స్థితి వర్ణనాతీతం. తమలాగే తమ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుందని సమస్యను భూతద్దంలో చూసి భయపడుతుంటారు. వీరిని కదిలిస్తే కన్నీళ్లే. ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో అపోహాలు.

పిల్లల్లో ఉబ్బసం వ్యాధి (పాల ఉబ్బసం)

పాల ఉబ్బసం మొదల్లయేది 3వ నెల నుంచే. తమ్ములు, ముక్కు దిబ్బడవేయడం, గాలి పీల్చలేకపోవడం, దగ్గు, నిద్రలేకపోవడం, పాలుత్రాగలేకపోవడం, పక్కలు ఎగరేయడం, గొంతులో గుర గుర శబ్దాలు రావడం ఇలా ఒకదాని వెంట ఒకటి లేదా కలిసి కూడా వస్తుంటాయి. తల్లిదండ్రులు ఇవన్నీ చూసి బెంబేలుపడతారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అది ఎంతకీ తగ్గక, తగ్గినా మళ్ళీ మళ్ళీ రావడంతో ఇంకా కంగారు పడుతుంటారు. డాక్టర్లని మారుస్తుంటారు. దురదృష్టవశాత్తు సరియైన వైద్యం సరియైన సమయంలో పొందలేకపోతే, మూఢనమ్మకాలను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు పెద్దవుతూ ఉంటారు. కొందరిలో వ్యాధి లక్షణాలు రోజు రోజుకీ పెరుగుతుంటాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి ఆర్ధిక ఇబ్బందులకు దారితీస్తాయి.

రాత్రిపూట పిల్లలు బాధపడకంటే తల్లిదండ్రులు ఎలా నిద్రపోగలరు? నిద్రలేక పోవడం వాళ్ళ పిల్లలు స్కూల్లో మరియు తల్లిదండ్రులు వారి వారి పనుల్లో ఇబ్బంది పడతారు. ఏ రాత్రి సమయాన పిల్లలు ఆయాసంతో బాధపడతారోనని కంగారు పడుతుంటారు. ఏది తింటే ఏమవుతుందో, ఏ ఊరు వెళ్ళితే ఎలా ఉంటుందో అని దిగులు పడతారు. ఆస్తమాతో బాధపడే పిల్లలు ఇంటిలో ఉంటే వారిని వదిలి ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడతారు. ఒకవేళ వెళ్లినా వారి మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది. పిల్లల ఎలా బాధపడుతున్నారోనని వీరు కూడా సరిగ్గా నిద్రపోలేరు. ఆస్తమాతో బాధపడే పిల్లలు వయసు పెరుగుతూ ఉంటే తమ వ్యాధి వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందడం గ్రహిస్తారు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, తమకోసం తమ తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెడుతున్న వ్యాధి ఎంతకీ తగ్గకపోవడం ఆ పసిహృదయాలను కలిచివేస్తుంది. తమ కారణంగా తమ తల్లిదండ్రులు అన్ని రకాలుగా బాధపడుతున్నారని గ్రహిస్తారు. ఒకవైపు వయసు పెరుగుతూ ఉంటే, ఇంకోవైపు జబ్బు బాధపెడుతూ ఉంటే ఆస్తమాతో బాధపడే పిల్లలు ఆలోచనలు పదాత్రు. ఇంతకీ ఈ జబ్బు ఏమిటి? ఎందుకు తగ్గదు? ఎందుకు తాము అందరిలా ఆదుకోలేకపోతున్నాం? సైకిల్ ఎందుకు తొక్కలేక పోతున్నాం? ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం? ఈ దగ్గు, గొంతులో గురగుర, ఊపిరి ఆడకపోవడం, నిద్రలేకపోవడం, ఏమిటిదంతా? అనే ఆలోచానాలు మొదలవుతాయి. ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆ పసిహృదయాలను కలిచి వేస్తుంటాయి.

 

ఒక్కసారి ఊపిరాడక బాధపడుతూ కూడా తమ కారణంగా తమ తల్లిదండ్రుల నిద్రపాడవుతుంది, సాధ్యమయినంత వరకు వారిని నిద్రలేపలేరు కొందరు పిల్లలు. ఆ బాధని తల్లిదండ్రులు గమనించకుండా తమలోనే దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ
==================================================================================
ఒక్కవైపు వయసు పెరుగుతూ ఉంటే, ఇంకోవైపు జబ్బు బాధపెడుతూ ఉంటే ఆస్తమాతో బాధపడే పిల్లలు ఆలోచనలో పడతారు. ఇంతకీ ఈ జబ్బు ఏమిటి? ఎందుకు తగ్గదు? ఎందుకు తాము అందరిలా ఆడుకోలేకపోతున్నాం? సైకిల్ ఎందుకు తొక్కలేకపోతున్నాం? ఎందుకు పరిగెత్త లేకపోతున్నాం? ఈ దగ్గు, గొంతులో గురగుర, ఊపిరి ఆడకపోవడం, నిద్రలేకపోవడం, ఏమిటిదంతా? అనే ఆలోచనలు మొదలవుతాయి. ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆ పసిహృదయాలను కలచి వేస్తుంటాయి.
==================================================================================
విధంగా తల్లిదండ్రులు తమ బాధని గమనించకుండా పిల్లలు పడే బాధలు మనసులను పిండేస్తాయీ. ఇదంతా ఎప్పుడో గమనించిన తల్లిదండ్రులు దుఃఖాన్ని ఆపుకోలేక, ఏమి చేయలేక, ఎవరికి వారే దిక్కుతోచక కుమిలి పోతుంటారు. ఇంకా ఎన్నో కోణాలు ఇందులో దాగునున్నాయి. స్కూల్లో తోడి పిల్లలతో, స్కూల్లో టీచర్లతో పడే ఇబ్బందులు ఇంకెన్నో ఉంటాయి. కాబట్టి ఆస్తమా పిల్లల ఆరోగ్యం గురించి స్కూలు యాజమాన్యాలు, తల్లిదండ్రులు పరస్పర అవగాహనా కలిగివుండాలి.

యువతీయువకుల అంతరంగాలు: చిన్నప్పుడు మొదలైన ఆస్తమా కొందరిలో యవ్వన ప్రాయం వచ్చేసరికి తగ్గిపోతుంది. ఇంకొందరిలో ఉధృతమవుతోంది. ఇంకొందరిలో అప్పుడే మొదటిసారిగా మొదలవుతుంది. సరియైన వైద్యం లభించిన వారిలో ఈ ఉబ్బసం పెట్టే బాధలు అన్ని ఇన్ని కావు. చిన్నప్పటి నుండి ఆస్తమాతో బాధపడే వారిలో పెరుగుదల ఆగిపోతుంది. శారీరకంగా పెరుగుదల అంతగా ఉండదు. కొందరు తోడివారి కంటే చాలా చిన్నగా కనిపిస్తారు. ఎంతకీ తగ్గని జలుబు, తుమ్ములు ముక్కు చీదడం, కారడం, దగ్గు, గొంతులో గురుగుర శబ్దాలు ఉంటె స్నేహితులతో కలవలేరు. ఎవరు ఏమనుకుంటారో నని దూరదూరంగా ఉండి పోతుంటారు. హుషారుగా ఆటలాడలేరు. కస్టపడి ఏ పని చెయ్యలేరు. చేయబోతే ఆయాసం ముంచుకొస్తుంది. చీటికీ మాటికీ, ప్రతి దానికి చికాకుపడతారు. అంతులేని కోపం వస్తుంది. సరియైన వైద్యం పొందితే ఇవన్నీ పోతాయి .
యుక్తవయసు వచ్చేటప్పటికి వీరి ఆలోచనలు పెళ్లి, దాని పర్యవసానం మీదకు వెళతాయి. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, అత్తవారింటిలో ఏ సమస్యలు తలెత్తుతాయో అని మధన పడుతుంటారు. కొంతమంది అన్ని సవ్యంగా ఉన్నా, పెళ్లిని ఈ కారణంగా వాయిదా వేస్తూ పోతుంటారు పైకి మాత్రం వేరే కారణం చూపిస్తారు. తల్లిదండ్రులు కూడా పెళ్లి చేస్తే ఏమవుతుందోనని వెనకడుగు వేస్తుంటారు.

అయితే సరియైన శాస్త్రియవైద్యం పొందితే ఈ బాధాలేవీ వుండవు. ఆస్తమా కారణంగా చదువుకు ఇబ్బంది కలగడమే కాకుండా కెరీర్ కూడా ప్రభావితం అవుతుంది. ఒక్కోసారి కోరుకున్న కెరీర్ లో ప్రవేశించలేక ఇష్టం లేని జాబ్ లో చేరిన వారున్నారు. కొంతమంది నుండి చీవాట్లును పొందుతుంటారు. ఇంకొంతమంది పని సరిగ్గా చేయలేక పై స్థాయి వారి నుండి చివాట్లను పొందుతుంటారు. అవమానాలకు గురవుతారు. తద్వారా ఆత్మా విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఏ.సి. బస్సులలో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు పలుఇబ్బందులు పడుతుంటారు.

పెద్దల అంతరంగాలు: కుటుంబ బాధ్యతలు మోసే భార్యాభర్తల్లో ఎవరికి ఆస్తమా ఉన్నా ఇంకొకరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆస్తమాతో అవస్థలు పడేవారి బాధలు చెప్పనక్కర్లేదు. ఒకవైపు ఆస్తమాతో బాధ ఇంకోవైపు సూటిపోటి మాటలు. ఆస్తమాతో బాధపడేవారు చాలా సందర్భాల్లో పైకి బాగానే కనిపిస్తారు. కొంత మందిలో అసలు ఈ జబ్బు ఉందంటే నమ్మలేం. కానీ వారు ఎంత బాధపడేది వారికి మాత్రమే తెలుసు. ఎదుటి వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు. అదే అసలు బాధ.

 

మహిళలు ఇంటి పనుల్లో, వంట పనుల్లో పురుషులు బయటి పనుల్లో, ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. పని చేయాలని ఉన్న చేయలేకపోయారు. పట్టుదలకు పోయి పనిచేస్తే ఆయాసం నీరసం ఆవహిస్తాయి. ఏ పని చేయలేరని పైగా సాధింపులు, ఇవన్నీ చూసి, భరించి మానసికంగా కుంగి పోతుంటారు. రాత్రి నిద్ర లేకపోవటం, ఏ పని చేయలేకపోవడం,

ఉబ్బసం రోగుల అంతరంగం – అది ఒక పెద్ద నిషాద గ్రంధం ఎన్నో భావోద్వేగాలు – మానసిక స్థితిగతులు సంగమం.
ఇవేవి అర్థం చేసుకోలేకపోతే అంత అయోమయం, మిగిలేది ఆయాసం. వీటన్నింటిని అర్థం చేసుకుని వైద్యం అందిస్తే – అంత ఆరోగ్యం, వారి మనసు ఆనందమయం.

ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి కావడం పదిమందితో కలవలేకపోవడం, మాట్లాడలేక పోవటం, ప్రయాణం చేయలేకపోవడం, చేసినా కొన్ని రోజులు బాధపడటం. ఏ ఫంక్షనుకు హాజరుకాలేకపోవడం, దాంతో ఎదుటివారు అపార్థం చేసుకోవడం, ఒక్కోసారి అవమానాలకు గురికావడం, వృత్తికి న్యాయం చేయలేకపోవడం వెరసి ఉబ్బసం రోగులు గురికాని మానసిక స్థితి అంటూ ఉండదు. అన్ని రకాలుగా బాధలు పడతారు.

ఈ జీవితం వృధా అని అందరినీ బాధపెట్టడం ఇక తనవల్ల కాదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొందరు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు ఇంకొందరు, ఆత్మహత్య అన్ని సిద్ధం చేసుకుని పిల్లల మొహం చూసి, వారి భవిష్యత్తుని తలచుకొని వారికోసం ఆ ప్రయాత్నాన్ని విరమించుకునే వారు మరికొందరు. ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలకు, మానసిక వత్తిడులకు గురవుతారు. మూఢనమ్మకాలూ – నకిలీవైద్యులనే ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారు. మోసపోతూనే ఉంటారు. ఆస్తమా రోగులు. ఇవన్నీ అర్థం లేనివని, సరియైన వైద్యుడి దగ్గర సరియైన వైద్యం, సరియైన సమయంలో పొందితే జీవితాన్ని అందరిలా ఆనందంగా, ఆరోగ్యాంగా గడపొచ్చనే నిజాన్ని తెలుసుకునేలోపు సగం జీవితం గడిచిపోతుంది.

వృద్ధుల అంతరంగాలు: జీవితంలో వారు ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్ని ఒక ఎత్తయితే, జీవిత చరమాంకంలో దీన్ని భరించాల్సిరావడం ఇంకో ఎత్తు. అనుక్షణం ఒక్కసారి ఊపిరి ఆగిపోతే బాగుండునని అదే తమకు నిజమైన మోక్షమని భావిస్తుంటారు. దేవుని ప్రార్థిస్తుంటారు. వయసు పైబడటంతో సహజంగానే ఏ పని చెయ్యలేరు. అసలే కుటుంబంపై ఆధారపడి బతుకున్నామన్న న్యూనత. అందుకే ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దనుకుంటారు. మౌనంగా భరిస్తుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు. వ్యాధి ముదిరిపోతోంది.
ఇలా ఒక కుటుంబంలో పసిపిల్లల నుండి పండుముసలి వరుకు ఉబ్బసం ఎవరికి ఉన్నా ఆ ఇంట్లో ఎవ్వరికీ ఉండనిది – మనశ్శాంతి.

సమాజం కోసం: తమకుగాని, తమవారికి గాని ఉబ్బసం ఉందనే విషయం తెలియకుండా ఉండాలనే కోరుకుంటారు ఉబ్బసం రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు . పక్క వారికి తెలిస్తే తమకు ఎక్కడ దూరమవుతారోనని, తమని ఎక్కడ దూరంగా ఉంచుతారోనని, చిన్న చూపు చూస్తారని భయపడుతుంటారు. అందుకే తమకుగాని, తమ పిల్లలకు గాని ఆస్తమా ఉన్నట్లయితే ఉందని అంత త్వరగా ఒప్పుకోరు. ఒకవేళ డాక్టర్ ఆస్తమా ఉందని చెప్పిన అంత త్వరగా అంగీకరించరు. అంగీకరించి సరియైన వైద్యం పొందడమే మంచిదని తెలుసుకోవాలి. తెలియజెప్పాలి.

ఆస్తమా అంటువ్యాధి కాదు. కలిసి ఎంతకాలం ఒకే దగ్గర జీవించిన ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదు. కేవలం ఇది వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధే కాదు, కాలుష్యం వల్ల కూడా ఆస్తమాకుగురవుతున్నారు. తల్లివైపు వారు కానీ తండ్రివైపు వారు కానీ అలర్జీ – ఆస్తమాతో బాధపడుతుంటే అది తమ పిల్లల్లో కొందరికి సంక్రమించవచ్చు. అందరికీ రాకపోవచ్చు. ఆస్తమా రోగులు దగ్గుతో, ఆయాసంతో బాధపడుతుంటే కొందరు వారిని అదోలా చూడటం మరింత బాధిస్తుంది. అందుకే ఆస్తమా ఉందన్న విషయాన్నీ బయటకు చెప్పుకోరు. అందరికీ తెలిస్తే తమ పిల్లలకు పెళ్లి కాదని, పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని, మిగతా పిల్లల భవిష్యత్తు పై కూడా దీని ప్రభావం పడుతుందని భయపడుతుంటారు. అందుకే పక్కవారు ఉబ్బసం రోగులకు ధైర్యం చెప్పాలి. చేతనైతే దారి చూపాలి. అంతే కానీ వేరుగా చూడకూడదు. అందుకే ఈ ఉబ్బసానికి రకరకాల పేర్లు వచ్చాయి. కొందరు అలర్జీ అని, ఇసినోఫీలియా అని, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని, డస్ట్ ఎలర్జీ మాత్రమేనని సంతృప్తి పడుతుంటారు. దీంతో కొందరు వైద్యులు కూడా రోగి అంగీకరించడనే ఉద్దేశ్యంతో అసలు విషయం ఉబ్బసం అని కాకొండ వారికి నచ్చేట్లు, అంగీకరించేట్లు చెప్పాల్సి వస్తుంది. ఆస్తమా అనే ముద్రను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో అసలైన శాస్త్రీయ వైద్యాన్ని అందుకోలేక పోతున్నారు. ఇది తప్పు. అసలు విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

తొలిదశలోనే ఉబ్బసాన్ని గుర్తించి, సరియైన శాస్త్రీయ వైద్యం పొందితే ఇప్పటి వరకు పడిన బాధలన్నీ మటుమాయం. కాని శాస్త్రీయ వైద్యం ఏమిటో తెలియకపోవడం వల్ల, తెలియజెప్పక పోవడం వల్ల ఎన్నో రకాల మూఢ నమ్మకాలకు లోనై మరిన్ని బాధలను ఉబ్బసం రోగులు ‘కొన్ని’ తెచ్చుకుంటారు. కాబట్టి అర్థం పర్థం లేని వైద్యాలకు ఇకనైనా స్వస్తి చెప్పి-నిజమైన శాస్త్రీయ వైద్యాన్ని పొంది, ఉబ్బసం రోగులందరూ అందరిలా, ఆనందంగా, ఆరోగ్యాంగా జీవించాలి. ఉబ్బసాన్ని నివారించే మందులను ప్రాణావసర మందులుగా ప్రభుత్వం గుర్తించి, రాయితీలు ప్రకటించి, ఉబ్బసం రోగులందరికి ఈ మందులను తక్కువ ధరల్లో అందించడమే, ఉబ్బసం రోగులకు నిజమైన ఉపశమనం. అప్పుడే “గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి” అనే జినా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థల నినాదం నిజమవుతుంది. ఉబ్బసం రోగుల అంతరంగం ఆనందంతో పొంగి పొర్లుతుంది.