ఉబ్బస వ్యాధికి కారణాలు/span>

 

వంశపారంపర్యంగా సంక్రమించే శరీరత్వం వాతావరణ కాలుష్యం,మానసిక ఉద్వేగాలు, మరింకెన్నో కారణాలు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉబ్బసానికి దారితీస్తాయి. వాయునాళాల లోపలి పోరా చిందర వందర కావడానికి, ఎర్రగా వాచిపోవడానికి, శ్లేష్మం అంతగా ఊరడానికి, ఇంకా కండరాలు బిగుసుకు పోవడానికి కారణభూతాలను అలర్జన్స్, ట్రిగ్గర్స్ లేదా ఉబ్బస వ్యాధి ప్రేరేపకాలు అంటారు. అవి:

  • మాటిమాటికి వచ్చే జబ్బులు, దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్లు.
  •  అలర్జన్స్ అంటే పుప్పొడి. ఇంటి దుమ్ము, దుమ్ము,ధూళి, బూజ, పెంపుడు జంతువుల వెంట్రుకలు, పాలపొడి, గుడ్డు, వంటకాలలో కలిపే రంగులు, కొన్ని ఆహారపదార్థాలు. వాయు కాలుష్యం, సిగరెట్ పొగ, సెంటు వాసనలు, రసాయనాలు, సిమెంట్, బొగ్గు, క్వారీ, కలప నుండి వెలువడే దుమ్ము, ధూళి.
  •  కొన్నిరకాల మందులు. ఉదా: యాస్పిరిన్ వంటి నొప్పి తగ్గడం కోసం వాడేకొన్ని మందులు మరియు బి.పి.కి వాడే మందు ఎటెనోలాల్. అకస్మాతుగా వాతావరణంలో కలిగే మార్పులు, ఎక్కువ తేమశాతం, చలిగాలి, ఆకస్మాత్తుగా ఉష్ణోగ్రత తగ్గడం మొదలైనవి.
  •  మానసిక వత్తిడులు, భావోద్వాగాలు, కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, కోపం, వృత్తిపరమైన ఇబ్బందులు, ఆవేశం, నవ్వు, బాధ ఆవేదన మొదలైనవి.
  • అజీర్తి, గ్యాస్ ట్రబుల్.

 

వివిధ వయస్సులో ఉబ్బసం వ్యాధి – లక్షణాలు – దుష్ఫలితాలు:

ఉబ్బస్సామ్ వ్యాధికి ఏ వయస్సు వారైనా గురికావచ్చు. సాధారణంగా బాల్యదశలో ఈ వ్యాధి మొదలవుతుంది.

  • పసి పిల్లలతో: కొంతమంది పిల్లలలో 3 నెలల వయస్సు నుండే ఉబ్బసం వ్యాదియూ లక్షణాలు కనబడతాయి. దీనినే పాల (బాల) ఉబ్బసం అంటారు. ఇలా ఒక్కసారి మొదలైతే వైరస్ల వలన కలిగే జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం తరచుగా వస్తూ, పోతూ, ఉబ్బసానికి దారి తీస్తాయి. ఆకస్మత్తుగ్గ వాతావరణంలో మార్పులు సంభవించిన గొంతులో గురగుర మనే శబ్దాలు, పక్కలు ఎగిరేస్తూ పాలు తాగలేకపోవడం, రాత్రిపూట నిద్రపోక పోవడం అనే లక్షణాలు కనబడతాయి. తల్లిదండ్రులలో ఎవరికైన అలర్జీ, ఆస్తమా ఉన్నా, ఇంటిలో పొగ తాగేవారున్నా, వాతావరణంలో దుమ్ము, ధూళి పెరిగినా, ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా పిల్లలలో ఉబ్బసం వ్యాధి అధికంగా వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి పిల్లలలో తల్లితండ్రులు తీవ్ర ఆందళోనకు గురౌతారు.

 

  • స్కూలు పిల్లలలో: తోటి పిల్లలతో పోలిస్తే పెరుగుదల తగ్గిపోవడం, అందరితో కలిసి ఆటలు ఆడలేక పోవడం, ఆడినా ఆయాసపడటం, త్వరగా అలసిపోవడం జరుగుతాయి. చీటికీ మాటికీ జలుబు చేస్తూ ఎంతకీ తగ్గక హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, అందు వలన స్కూలుకు సరిగా వెళ్లలేకపోవడం జరుగుతుంది. రాత్రిపూట నిద్రపోలేరు. గనుక మరుసటి రోజు మగతగా ఉండటం, చదువులో వెనుకపడటం జరుగుతుంది. ఒక్కక్కసారి పిల్లలు తమ తల్లిదండ్రులు బాధపడతారని తమ బాధను దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించిన తల్లిదండ్రులు తల్లడిల్లి పోతారు. మనోవేదనకు గురవుతారు. ఇది ఆ ఇంటిలో అశాంతికి దారి తీస్తుంది.

 

  • యువతీ యువకులలో: వయస్సుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం వీరిలో కనబడుతుంది. జలుబు, దగ్గు, ఆయాసం, మాటిమాటికి ముక్కు చీదడం, వరుసగా తుమ్ములు రావడంతో స్నేహితులు ఏమైనా అనుకుంటారని వాళ్లతో కలవలేరు. ఆటలకు, అలసట కలిగించే పనులకు దూరంగా ఉండిపోతారు. తమ వయస్సు వారిలో ఉండే ఉత్సాహం, చురుకుదనం ఉండక ఆత్మా విశ్వాసాన్ని కోల్పోయి ఆత్మన్యూనతాభావానికి గురవుతారు. ఇది వారి కెరీర్, సెటిలెమెంట్  మరియు ఉజ్వలమైన భవిష్యత్తు పై చేదు ప్రభావాన్ని కలుగు జేస్తుంది అంతేకాదు పెళ్లి చ్చేస్తే ఏమవుతుందో అని తల్లిదండ్రులు, చేసుకుంటే ఎలా ఉంటుందో అని వీరు తీవ్రమైన మానసిక ఆందోళనతో పెళ్లిని కూడా వాయిదా వేస్తుంటారు.

 

ఈ విధంగా ఉత్సంగా, ఉల్లాసంగా గడవలసిన బాల్యదశ, యవ్వనదశ ఈ వ్యాధి వాళ్ళ నరకప్రాయంగా మారుతాయి.

పెద్దలలో: భార్య భర్తలలో ఎవరికి ఉబ్బసం ఉన్న వారు ఇంటి బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతారు. మహిళలు వంట పని, ఇంటి పనుల్లో ఇబ్బందిని ఎదుర్కుంటారు. త్వరగా అలసిపోయి ఏ పని చేయాలన్న దగ్గు ఆయాసం ముంచు కొస్తాయి ఇల్లు దులిపితే ఆ రోజు వారి బాధ వర్ణనా తీతం. వీరి బాధను అర్థం చేసుకోలేక ఇంటి పనులు త్వరగా చేయలేక పోతున్నారని ఇంటిలోని వారు వీరి పై చిందులేస్తారు, చికాకు పడతారు.

ఆఫీసు పనులు, బయటి పనుల్లో మగవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫ్యాక్టరీలలో, మిల్లులలో దుమ్ము, ధూళి, రసాయనాలు ఉన్న వాతావరణంలో పని చేయడమంటే వీరికి శాపంలా మారుతుంది. తద్వారా పనిదినాలను కోల్పోతారు. ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో పై అధికారులు వీరి పై చిందులు వేస్తారు, నిందిస్తారు. ఇలా బాధపడే ఈ భార్యాభర్తలు తమకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుందేమోనని భయంతో వణికిపోతారు. తీరా వంశపారం పరంగా పిల్లలకు వస్తే అది ఆ కుటుంబంలో మానసిక అశాంతికి దారితీసి, ఆందోళన కలుగుజేస్తుంది. తమ పిల్లల కూడా తమలాగే బాధపడాల్సి వస్తుందనే తీరని వ్యధకు లోనవుతారు.

 

వయస్సు మళ్ళిన వారిలో :  వీరిలో ఉబ్బసం కలుగజేసే బాధ వర్ణనాతీరం. ఒక్క మాటలలో చెప్పాలంటే అప్పటివరకు వారు తమ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఒక ఎత్తయితే ఈ ఉబ్బసాన్ని జీవిత చరమాంకంలో భరించాల్సిరావడం ఇంకో ఎత్తు

 

 

ఈ విధంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ బాధించే ఈ ఉబ్బసం ఆర్థికంగా, శరీరంగా, సామాజికంగా, మానసికంగా కృంగదీసి వారి కుటుంబాల్లో శాంతిని, ఆనందాన్ని హరించి వేసి విషాదాన్ని రేపుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుటుంబంలో కోట్లాది ఉబ్బసం రోగులు గాలి పీల్చలేక, వదలలేక అనునిత్యం అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న శాస్త్రీయ వైద్య విధానాలు తెలియక, తెలిసినా నివృత్తికాని ఎన్నో అపోహలతో, అనుమానాలతో అర్థం పర్థంలేని మూఢ నమ్మకాలతో, అశాస్త్రీయ వైద్య విధానాలు వైపు ఆకర్షింపబడి చివరకు వాటి వలన ప్రయోజనం లేక నిరాశ, నిస్పృహలకు గురువుతున్నారు. జీవితాలను భారంగా, ఆయాసంగా వెళ్ళదీస్తున్నారు.

 

ఈ విధంగా కాలుష్యంతో బాటు రోజు రోజుకూ పెరుగుతున్న ఉబ్బసం, ఆ వ్యక్తిపై, కుటుంబంపై, సమాజం పై కలుగజేసే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ‘జినా’ ( Global  Initiative  for  asthma ) మరియు ‘ ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ( W.H.O ) ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం రోజుని ప్రపంచ ఆస్తమాదినంగా ప్రకటించి ‘గాలి పీల్చే హక్కు అందరికి సమానంగా ఉండాలి ‘ అనే నినాదాన్నిచ్చింది.